అరకులోయ: జయ జయహే.: మండల కేంద్రంలోని మాదాల పంచాయతీ పరిధిలోని దోమలజోరు, రక్తకండి గ్రామాలకు సంబంధించిన హుదూద్ మోడల్ కాలనీ నిర్మాణ పనులను అరకులోయ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) లవరాజు గురువారం నాడు సందర్శించి పరిశీలించారు.
2014 అక్టోబర్‌లో సంభవించిన హుదూద్ తుఫాను ప్రభావంతో ఈ రెండు గ్రామాలు పూర్తిగా ధ్వంసమైనవి. గిరిజన నివాసితులు సర్వస్వం కోల్పోయి, ఇల్లు లేక రోడ్డున పడ్డారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం హుదూద్ మోడల్ కాలనీగా ఈ గ్రామాలకు ఇళ్ల నిర్మాణం మంజూరు చేసింది. అయితే, 11 ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విషయం తెలుసుకున్న ఎంపీడీవో లవరాజు, రెండు గ్రామాలను స్వయంగా సందర్శించి, మోడల్ కాలనీ పనులు ఆలస్యమయ్యే కారణాలను అధికారులతో కలిసి ఆరా తీశారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పాలకులకు తెలియజేసి, కాలనీ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

