విశాఖపట్నం : జయజయహే : మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సహకారంతో 32వ వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఇ డబ్ల్యూ ఎస్ సహకారంతో 32వ వార్డు అల్లిపురం , నెరేళ్ల కోనేరు ప్రాంతంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కుటుంబాల్లో ఒకరి సంపాదన చాలని విధంగా రోజురోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయని అన్నారు. నిత్యావసరాలే కాదు.. పిల్లలను చదివించాలంటే రూ.వేలు. రూ. లక్షల్లో ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం మహిళలు ఉపాధి అవకాశాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వావలంబన దిశగా అలోచించిందని పేర్కొన్నారు. ఆర్థికంగా ఏదగడానికి తోడ్పాటు అందివ్వాలని సంకల్పించిందని తెలిపారు. ఆ దిశగా ముందడుగు వేసిందని అన్నారు. ఉచితంగా కుట్టుశిక్షణతో పాటు మిషన్ కూడా ఇచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీస్ ఏ పిడి పద్మావతి , బీసీ కార్పొరేషన్ ఇడి శ్రీదేవి , అప్పారావు , షేక్ నజీర్ , సిఓ మంగ , బీసీ కార్పొరేషన్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.