Friday, April 25, 2025
HomeBlogకూలీలు అనొద్దు.. శ్రామికులని పిలుద్దాం

కూలీలు అనొద్దు.. శ్రామికులని పిలుద్దాం

స్వయంప్రతిపత్తితో గ్రామస్వరాజ్యం

గ్రామ పంచాయతీలు ఆర్థిక స్వావలంబన

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

జాతీయ గ్రామ పంచాయతీరాజ్ దినోత్సవానికి హాజరు

జయజయహే : ‘గ్రామ పంచాయతీలు స్వయంప్రతిపత్తితో ముందుకు సాగినపుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పని చేయాలి. అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలి. అభివృద్ధి, ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా వెలగాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘నాకు పల్లెలు అంటే ప్రాణం. పల్లెల్లో బతకాలని బలంగా ఉండేది. కానీ సాధ్యపడలేదు. కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టాను. శాఖలను తీసుకున్న తర్వాత 2 నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన తర్వాత అధికారుల సమావేశంలో నేను చెప్పింది ఒక్కటే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఏ పనికి ఏ నిధుల కేటాయింపు జరిగిందో అది పక్కాగా దానికే ఖర్చు చేయాలి. పారదర్శకంగా పనులు జరగాలి అని చెప్పాను. ఎలాంటి మళ్లింపులు, వృధా ఖర్చులు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూరాలి అని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో పని చేసే వారిని కూలీలు అని పిలవడం కాస్త ఇబ్బందిగా ఉంది. గ్రామాల అభివృద్ధిలో చోదకులుగా పని చేస్తున్న వారిని అలా పిలవడం అంత బాగా లేదు. కూలీ అనే పదం బ్రిటీషు వారి భారతీయులతో వెట్టి చాకిరీ చేయించుకునేందుకు ఉపయోగించిన పదం. దాన్ని ఇప్పుడు మనం ఉపయోగించడం సమంజసం కాదు. కూలీ అంటేనే చాకిరీ చేసే వారుగా అనిపిస్తుంది. ఇక నుంచి ఉపాధి శ్రామికులు లేదా నేస్తాలుగా వారిని పిలుద్దాం. దీన్ని రాష్ట్రంలోని అధికారులకు తెలియజేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో రూ.10,669 కోట్ల పనులు జరిగాయి. 13,326 గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను చక్కగా అమలు చేశాం. 4 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 21,564 గోకుళాలు, 12,950 నీటి తొట్టెలు, 20,286 ఫాం పాండ్స్ ను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం మనందరి సమష్టి కృషికి నిదర్శనం. దీంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థను గిరిజన గ్రామాల్లోనూ విస్తరించడం ఓ గొప్ప ముందడుగు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రూ.1,005 కోట్లతో 1069 కిలోమీటర్ల మేర రోడ్లను వేసి, డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి ముందడుగు వేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తున్నాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

స్టాల్స్ పరిశీలన

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ తిలకించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ కూటమి ప్రభుత్వ విజన్ ని ఆవిష్కరించే విధంగా ఆకట్టుకున్నాయి. పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన సిమెంట్ రోడ్లు, గోశాలలు, నీటి తొట్టెలు, ఫాం పాండ్స్ తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల నమూనాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. గుంటూరు నగర పాలన సంస్థ పరిధిలో జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్ నమూనా పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని యూనిట్లు ఉన్నాయి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత స్వతంత్ర్య దినోత్స వేడుకల నిర్వహణ ఖర్చులను పవన్ కళ్యాణ్ గారు రూ. 10 వేలు, రూ. 25 వేలకు పెంచిన తర్వాత పంచాయతీల్లో నిర్వహించిన స్వతంత్ర్య దినోత్సవ వేడుకల ఫోటోలతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ, చెత్త నుంచి సంపదసృష్టి కేంద్రాల వివరాలు, వాటి పనితీరులను ప్రదర్శించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నేతృత్వంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనుల వివరాలను ఆ విభాగం అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ లో పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. వీటితో పాటు గ్రామీణ నీటి సరఫరా విభాగం, అడవితల్లి బాట, వాటర్ మేనేజ్ మెంట్ స్కీమ్ నమూనాలను అధికారులు ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, ఏపీఎస్ఆర్ డీపీర్ కమిషర్ ఆర్. ముత్యాలరాజు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ వై.వి.కె. షణ్ముఖ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సీఈ శ్రీ బాలు నాయక్, గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్య విభాగం చీఫ్ ఇంజినీర్ గాయత్రిదేవి, సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

                                     

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments