ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధలో ప్రస్తుత కూటమి సర్కార్ పలు కీలక మార్పులు చేస్తోంది. సచివాలయాల హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బదిలీల కౌన్సిలింగ్ చేపట్టింది. ఇందుకోసం పలు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల కోసం చేపట్టిన కౌన్సిలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది.
దీనిపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాల శాఖ తరపున జి.ఓ.ఎం.యస్ నెం:5 విడుదల చేసిందని, అందులో చాలా స్పష్టంగా పాయింట్ నెంబర్ 8లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు , వివాదాలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు.
అయినా దాదాపు అన్ని జిల్లాలలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ శాఖకు చెందిన రీజినల్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో జరుగుతున్న బదిలీలు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కనీసం ఖాళీల వివరాలు సైతం ప్రదర్శించకుండా సచివాలయ ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ,బదిలీల ప్రక్రియను పూర్తి అపహాస్యం చేస్తున్నారన్నారు. కొన్ని శాఖల అధికారులు మరో అడుగు ముందుకు వేసి మీకు సిఫారసు లేఖ ఉందా లేదా అని అడిగి ఒకవేళ సిఫారసు లేఖ లేని పక్షంలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో కూడా కనీసం సమాచారం ఇవ్వమని చెప్తున్నారని ఆరోపించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం,విశాఖపట్నం, కృష్ణా,గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉద్యోగులు అనైతిక బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను బాయ్ కాట్ చేసి కౌన్సిలింగ్ కేంద్రాలలో నిరసనలు చేపట్టారని వారు వెల్లడించారు. తక్షణం బదిలీల ప్రక్రియపై సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి జి.ఓ.ఎం.యస్ నెం.5 ప్రకారం ఎటువంటి వివాదాలకు తావులేకుండా కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.