జయజయహే : ఇటీవల రెండు విషాదకర సంఘటనలు విద్యా వ్యవస్థను తలకిందులు చేస్తున్నాయి. ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం విద్యార్థిని ఓ అధ్యాపకురాలిని చెప్పుతో కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం, మరో ఘటనలో ఇద్దరు సోదరులు తమ తరగతిలో వేరొక విద్యార్థితో పడుతున్న గొడవను ఆపడానికి వచ్చిన ఉపాధ్యాయుడిని, చనిపోయేంత వరకు కొట్టడం. ఇంజినీరింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం, త్రాగి కాలేజీకి రావడం, చైన్ స్నాచింగ్ లకు పాలుపడటం, ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై ఆన్ లైన్ ఆప్ లలో అప్పులు చేయడం, తల్లిదండులను బెదిరించడం — ఇవన్నీ గుండె చెదిరే విషయాలు. ఈ దాడుల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి చిన్నవే కాదు. ఇవి కుటుంబ, విద్యా, సామాజిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ చుట్టేస్తున్న లోపాలను ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో ఒక ముఖ్యమైన అంశం — తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్నది ఏమిటో కూడా తెలియకపోవడం. పిల్లల విద్యకు సంబందించిన విషయాలను ఉపాధ్యాయుల ద్వారా, కాలేజీ యాజమాన్యాల ద్వారా కాకుండా, వాళ్ళ స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఇందులో ఎన్ని వాస్తవాలు ఉంటాయో ఎన్ని అవాస్తవాలు ఉంటాయో పెరుమాళ్ళకే ఎరుక. ఈ పద్ధతి విద్యార్థుల నడక, నడతపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అలాగే, పిల్లల మనసుకు ఏమి నచ్చుతుందో పట్టించుకోకుండా, తామనుకున్న కోర్సులనే బలవంతంగా చదివిస్తుండటం కూడా విద్యార్థులలో మానసిక ఆందోళనకు దారి తీస్తోంది. ఇది తరచూ ఆత్మహత్యలకూ దారితీస్తోంది, ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులపైనే దృష్టి పెట్టి, వారి ప్రవర్తనపైన మాత్రం పట్టించుకోకపోవడం అత్యంత హేయం. ఉపాధ్యాయులకు విద్యకు సంబంధించే పనులతో పాటు, క్యాంటీన్ పర్యవేక్షణ, ల్యాబ్ మరియు టాయిలెట్ల శుభ్రత, ఫీజు సేకరణ వంటివి అప్పగిస్తున్నారు. అందువలన ఉపాధ్యాయులు విద్యార్థుల దృష్టిలో చులకన అవుతున్నారు. కళాశాల బస్సులో కూడా ఉపాధ్యాయులు నిలబడి, విద్యార్థులకు సీటు ఇవ్వాలి అనేలా పరిస్థితి తయారైంది. ఇందులో దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే, ఉపాధ్యాయులు కూడా బస్సు ఛార్జీలు చెల్లించాల్సిందే. విద్యార్థి తప్పు చేసినా, ఉపాధ్యాయుడే శిక్ష పొందాల్సిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఉపాధ్యాయుడు నిస్సహాయుడు, విలువ లేని వస్తువుగా మారుతున్నాడు.
ఈ పరిస్థితులను లోతుగా పరిశీలించినట్లయితే, కొన్ని విషయాలు తెలుస్తాయి. 1992లో ప్రారంభమైన ఆర్థిక స్వేచ్ఛ (లిబరలైజేషన్), ప్రైవటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత దేశంలో డబ్బు సంపాదించటం సులభమైంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల వృద్ధితో ప్రజల వద్ద అధిక డబ్బు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల, ఐటీ ఉద్యోగుల జీతాలు సామాజికంగా డబ్బును ప్రదర్శించే భావనకు దారితీశాయి. మొబైల్, టీవీ వంటివి వినోదానికి మార్గంగా మారాయి. అయితే, ఇవి శారీరకంగా, మానసికంగా కుటుంబ సభ్యులను దూరం చేస్తూ ఉన్నాయని గమనించాలి. ప్రైవేట్ రంగ ఉద్యోగాల వలన చిన్న కుటుంబాల్లో జీవనం పెరిగింది. పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోవటం వల్ల పిల్లలకు మంచిదేమిటి, చెడ్డదేమిటి చెప్పేవారు లేకుండా పోతున్నారు. విద్యా వ్యవస్థలో భద్రత, గౌరవం, విలువలు మళ్లీ స్థిరపడాలంటే — తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, సమాజం అందరూ కలసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులకు గౌరవం కల్పించని సమాజం మరిదేనిని గౌరవించలేదు. ‘మార్పు మన చేతుల్లోనే ఉంది. ఇది శీఘ్రం మొదలుకావాలి’ అని ఒక ఉపాధ్యాయుడుగా, మరియు ఒక మంచి సమాజాభిలాషిగా, నా ప్రగాఢ కోరిక. .
రచన: ప్రో. విశ్వేశ్వర రావు చెనమల్లు